అసహాయతా హాస్యాలు
పొద్దున్నే లేచింది ఇల్లాలు. లేదు లేదు, లేపింది పాపాయి.రాత్రి రెండు సార్లు ఏడిస్తే లేచి పాలు పట్టి పడుకోబెట్టింది. ఇప్పుడు ఇంకో గంటలో తెల్లవారుతుంటే ఇంకేం పడుకోగలనులే అని పక్క మీదినించి లేచి కిందికెళ్ళి పాపాయి కాలకృత్యాలు తీర్చింది. పాలు ఇచ్చి, కడిగిన గిన్నెలు తీసి సర్దింది. తనో కప్పుడు కాఫీ తాగే లోపు ఓ పది సార్లు పాప పిలిచింది. నవ్వుతూ పలకరించి ఆ బోసి నవ్వులు చూసుకుని సూర్యుడు తెల్లవారకుండానే ఉదయించాడనుకుంది. అంతలోకే తూర్పు తెల్లవారింది. పాపను సముదాయిస్తూనే ఈమెయిల్సు చూసుకుని బడిలో ఆ రోజు తన వంతు క్లాసంతటికీ లంచి చెయ్యడం అని గుర్తొచ్చి, వచ్చే వారం ఇంకో పనికి రాగలవా అని అడిగిన టీచరుకి అవునని జవాబిచ్చి, ఇంకో కార్యక్రమాన్ని ఇంకొందరు తల్లులతో కో-ఆర్డినేటు చేసి, మరో సారి తనను వదిలేసి వెళ్ళినట్లు గట్టిగా అరిచి పిలుస్తున్న పాపాయిని కోపం నటిస్తూ పలకరించి, ఇంతలోకే కిందికి వచ్చిన అబ్బాయిలిద్దరికీ పాలిచ్చి పొద్దున టిఫిన్లూ, పిల్లల లంచ్‌లూ తయారు చెయ్యడం మొదలు పెట్టింది.
శ్రీవారు కిందికి వచ్చారు. ఏమిటి, రాత్రి గిన్నెలు డిష్‌వాషరులో వెయ్యలేదా అంటూ శుభోదయం చెప్పారు. చివుక్కుమన్నా జవాబు చెప్పి లాభం లేదని, ఇంతలోకే పాపాయి మళ్ళీ పలకరిస్తే ఓ నవ్వు విసిరేసింది. నాలుగు సార్లు చెప్పాక ఐదో సారి వెళ్ళి బట్టలు వేసుకొచ్చిన పెద్దబ్బాయిని చూసి ఊపిరి పీల్చుకుందామనుకుంటే చొక్కా తిప్పేసి వేసుకున్నాడు. గట్టిగా వాడినో మాటనే సరికి చిన్న వాడు తను వేసుకున్న బట్టలు తీసేసి అన్నను మంచి పిల్లాడనిపించాడు. ఓ పది సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఓ వంద మనసులో లెక్క పెట్టుకుని, సరిగా తయారయ్యేంత వరకూ ఓపిక పట్టి, నయానా, భయానా టిఫిను తినిపించి, బ్యాగులు సర్ది, పాపాయికి వెచ్చటి బట్టలు వేసి, తానూ తయారయ్యి పిల్లల్ని బయల్దేరదీసింది. పెద్ద వాడిని స్కూలు బస్సు ఎక్కించి, చిన్న వాణ్ణి బడిలో దింపి ఇంటికి వచ్చే సరికి పాపాయి కారు సీటులో జోగుతూ ఉంటే, “అమ్మయ్య ఇప్పుడూ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు” అనుకుంది. ఇంటికి వచ్చి కారు ఆపిందో లేదో, పాపాయి, “ఎక్కడికి పోయావు, నన్నొదిలేసి” అన్నట్టు ఏడుపు లంకించుకుంది. దొరుకుతుందనుకున్న కాస్త విశ్రాంతి కూడా గగనమయ్యేసరికి ఉసూరుమనిపించినా, పాపాయిని, “ఇక్కడే ఉన్నాను లెవే. అప్పుడే నిద్రైపోయిందా” అంటూ పలకరించి లోపలికెళ్ళి పక్కన పడుకోబెట్టుకుని పాడుతూ, ఆడుతూ కాసేపు ఊపే సరికి మొత్తానికి శాంతించిన పాపాయి తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయింది.
ఫోను మోగే సరికి ఓ యుగమయ్యిందేమో అన్నట్టు ఉలిక్కిపడి లేచిన తల్లికి తీరా చూస్తే తను ఇంట్లోకి వచ్చి పావు గంటే అయిందని తెలిసింది. పాపాయిని జాగ్రత్తగా పడుకోబెట్టి, పరిగెత్తి వెళ్ళి ఫోనందుకుంది. తీరా ఫోనులో పిలిచింది ఓ టెలీమార్కెటరు. వీళ్ళకీ తెల్ల వారిందీ, అవసరం లేనివన్నీ అంటగట్టేందుకు, అందరి చేతా తిట్లు తినిపించుకోవడానికీను, అనుకుని నీరసంగా వంటింట్లోకి వెళ్తే గుర్తొచ్చింది, ఇంకా తనేమీ తినలేదని. ఏదో కాస్త తిన్నాననిపించి, పిల్లలు ఆ కాస్త సేపట్లో పోగు చేసిన చెత్తని శుభ్రం చేసి, సర్ది, ఇక మధ్యాహ్నం బడికి పట్టికెళ్ళాల్సిన వంట తయారు చెయ్యడం మొదలు పెట్టింది. కాసేపట్లో శ్రీవారి ఫోను. తను పొద్దున తిన్న దాంట్లో క్యాలరీలు లెక్కపెట్టి ఓ రెండు ఎక్కువయ్యాయి కనుక మధ్యాహ్నం జాగ్రత్తగా చూసి తినమని చెప్పి, పిల్లలని ఇంకో కార్యక్రమంలో చేర్పించేందుకు అత్యవసర ప్రయత్నాలు ఆరంభించమని పురమాయించి, వాళ్ళు తిన్న టిఫిన్లో పోషకాలు ఏం తక్కువయ్యాయో గుర్తు చేసి తన బాధ్యత నెరవేర్చుకుని ఫోను పెట్టేశారు.
వంట చేసుకుని సర్దుకుని స్నేహితురాలిని పలకరిద్దామని ఫోను చేసే సరికి పాపాయి లేచి మళ్ళీ పిలిచింది. పాపని ఆడిస్తూ మాట్లాడుతుంటే, స్నేహితురాలు, “నా తీరిక కాస్త నీకిద్దునే, ఇవ్వగలిగితే” అంది. “ఏం చేసుకోను ఇంకొంచెం ఖాళీ సమయం, ఇంకొంచెం ఇంటి పని చేసుకునేందుకా, వద్దులే. ఒకటొకటే పనులైపోయి రాత్రి ఏడింటికి ఆటనుంచి పిల్లల్ని ఇంటికి తీసుకు వచ్చానంటే వాళ్ళా స్నానాలు, తిళ్ళూ చూసుకుని పక్క మీద వాలడం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంకా సమయం దొరికితే ఆ మూల వాక్యూం చేసుకోవడమో, ఈ గది సర్దుకోవడమో, ఆ సామాన్లు తెచ్చుకోవడమో మరో సమయం దొరకక మిగిలిపోయిన పనో చేసుకోవల్సి ఉంటుందని కాని తీరికేదే” అంది. స్నేహితురాలు వినిపించుకోవడంలేదు. ఆమెకి తెలియంది కాదు. కాని మొదటి మాటలకే ఆమె నవ్వడం ప్రారంభించింది, అది ఆగట్లేదు. ఆ నవ్వులో ఏం దాగుందో? ఆనంద బాష్పాలు లాగే అసహాయతా హాస్యాలు.
Comments(12)
